Dearness Allowance Hike | కేంద్ర ప్రభుత్వంలోని ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డియర్నెస్ అలవెన్స్ 3శాతం పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. డీఏ పెంపు ప్రతిపాదనలకు బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. జూలై ఒకటి నుంచి చెల్లించాల్సిన డియర్నెస్ అలవెన్స్ రేటు 50శాతం నుంచి 53శాతానికి పెరిగింది. కేంద్రం నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంలోని దాదాపు కోటిమందికిపైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇందులో 48లక్షల మంది ఉద్యోగులు, 67లక్షల మంది పెన్షన్లు ఉన్నారు. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో డీఏ పెంపుపై ప్రకటన చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతలు ఆలస్యం చేయకుండా డీఏను పెంచాలని సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారు. సాధారణంగా అక్టోబర్ మొదటివారంలో డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ పెంపుదల జరుగుతుందని తెలిపారు. ఈ సారి దసరా పండుగకు సైతం డీఏ పెంపుపై ప్రకటన చేయలేదు.
ఒక ఉద్యోగి బేసిక్ వేతనం రూ.18వేలు ఉంటే.. 53శాతం డియర్నెస్ అలవెన్స్ ప్రకారం.. సదరు ఉద్యోగి వేతనం ప్రతినెలా దాదాపు రూ.54. వరకు పెరుగుతుంది. ఉద్యోగి బేసిక్ వేతనం రూ.25వేలు నెలకు రూ.750 బెనిఫిట్ లభిస్తుంది. కార్మికుడి మూలవేతనం రూ.35వేలు అయితే నెలకు రూ.1050 అదనంగా చెల్లించనున్నారు. రూ.52వేల బేసిక్ జీతం అందుకుంటే కార్మికులకు.. డీఏ పెంపుతో నెలకు రూ.1,560 అదనంగా ప్రయోజనం పొందుతారు. రూ.లక్ష బేసిక్ వేతనం ఉంటే ఉద్యోగి అకౌంట్లో నెలకు రూ.3వేలకుపైగా అదనంగా జమ అవుతుంది. సాధారణంగా డీఏ, డీఆర్ రేట్స్ పెంపు ప్రకటన సెప్టెంబర్‌లో జరుగుతుంది. అయితే, డీఏ పెంపును అక్టోబర్‌లోనూ ప్రకటించిన సందర్భాలున్నాయి. అక్టోబర్ 3న జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను కేంద్రం ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు రూ.2029కోట్ల బోనస్‌ను ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ నెల 9న జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ ప్రకటిస్తారని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆశించారు. సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్బీ యాదవ్ కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. జాప్యం చేయకుండా డీఏ పెంచాలని డిమాండ్ చేశారు. అక్టోబర్‌లో అలవెన్స్ ప్రకటిస్తే.. నవంబర్‌లో చెల్లింపులు చేయవచ్చన్నారు.
డీఏను సకాలంలో విడుదల చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వమే లాభపడుతున్నది ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రికి రాసిన లేఖలో డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) గడువు జూలై ఒకటిన ముగియనుందని.. సాధారణంగా సెప్టెంబర్‌లో చివరి వారంలో డీఏ పెంపు ప్రకటన ఉంటుందని ఎస్బీ యాదవ్ పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఉద్యోగులకు మూడునెలల బకాయిలు చెల్లించారు. అలవెన్సుల ప్రకటనలో జాప్యంపై కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. నవరాత్రి, దుర్గాపూజ, దసరా పండగలు ముగిసినా కానీ పెంపుపై ప్రకటన చేయలేదు. డీఏ, డీఆర్ పెంపుతో ప్రభుత్వంపై రూ.వేలకోట్ల భారంపడుతుందని.. మూడు, నాలుగు నెలలు ఆలస్యంగా ప్రకటిస్తున్నది. ఈ కాలంలో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి తద్వారా వడ్డీ ద్వారా ఆదాయం పొందుతుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. జనవరి ఒకటి, జూలై ఒకటి నుంచి డీఏ, డీఆర్ పెంచాలని నిబంధన ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారీ మూడు నుంచి నాలుగు నెలలు ఆలస్యం చేస్తూ వస్తున్నది. ఇలా ఆలస్యమైతే ప్రభుత్వానికి వేలకోట్లు ఆదా అవుతాయని ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) జనరల్ సెక్రటరీ, నేషనల్ కౌన్సిల్ (JCM) స్టాఫ్ సైడ్ సీనియర్ సభ్యుడు సీ శ్రీకుమార్ పేర్కొన్నారు.