అహ్మదాబాద్: చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప కనిపించింది. (Dead Frog In Chips Packet) ఇది చూసి ఒక కుటుంబం షాక్ అయ్యింది. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిప్స్ తయారీ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం పుష్కర్ ధామ్ సొసైటీకి చెందిన జాస్మిన్ పటేల్ నాలుగేళ్ల మేనకోడలు స్థానిక షాపు నుంచి చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసింది. ఆ మహిళ తొమ్మిది నెలల కూతురు, ఆ చిన్నారి కలిసి చిప్స్ తిన్నారు.
కాగా, చిప్స్ ప్యాకెట్లో చనిపోయిన కప్పను ఆ పాప గమనించింది. ఆ వెంటనే ఆ ప్యాకెట్‌ను దూరంగా విసిరేసింది. ఆ చిప్స్ ప్యాకెట్‌ను బాలాజీ వేఫర్స్ అనే సంస్థ తయారు చేసినట్లు జాస్మిన్ పటేల్ గమనించింది. ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసింది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బుధవారం ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేసింది.
మరోవైపు జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. చిప్స్ ప్యాకెట్ అమ్మిన షాపును తనిఖీ చేశారు. బాలాజీ వేఫర్స్ తయారు చేసిన చిప్స్ ప్యాకెట్ల బ్యాచ్ నుంచి శాంపిల్స్ సేకరిస్తామని తెలిపారు. దర్యాప్తు తర్వాత తగిన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.