Dead Body | పాట్నా : మార్చురీ అసిస్టెంట్ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలోకి స్ట్రెచర్‌పై తీసుకెళ్లకుండా.. నేలపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన బీహార్‌లోని వెస్ట్ చంపారన్ జిల్లాలో వెలుగు చూసింది.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ధర్మేంద్ర కుమార్ తీవ్రంగా స్పందించారు. మృతదేహాన్ని నేలపై ఈడ్చుకెళ్లిన మార్చురీ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. అప్పటికే మార్చురీ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపినట్లు చెప్పారు. ఇక ఈ ఘటనలో పోలీసు పాత్ర కూడా ఉందన్నారు. సదరు పోలీసుపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశామన్నారు. ఈ ఘటనకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. 72 గంటల్లో నివేదిక సమర్పించాలన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునారవృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.