న్యూఢిల్లీ/లండన్, ఏప్రిల్ 22: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ర్టాలు అప్రమత్తమవుతున్నాయి. నాలుగో వేవ్ భయాందోళనల మధ్య వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు బహిరంగ ప్రాంతాల్లో మాస్కు తప్పనిసరి నిబంధనను శుక్రవారం నుంచి తిరిగి అమల్లోకి తెచ్చాయి. ఉల్లంఘించినవారికి రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించాయి. అయితే ప్రైవేటు ఫోర్ వీలర్ వాహనాల్లో ప్రయాణించే వారికి మినహాయింపు ఇస్తున్నట్టు ఢిల్లీ ఆరోగ్య శాఖ పేర్కొన్నది. ప్రజలు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్ తెలిపారు. మద్రాస్ ఐఐటీలో రెండు రోజుల వ్యవధిలో 30 మందికి కరోనా నిర్ధారణ అయింది. 700 మంది శాంపిల్స్‌ను పరీక్షలకు పంపగా, వారిలో కొత్తగా 18 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇతర రాష్ర్టాల నుంచి ఇన్స్టిట్యూట్కు వచ్చిన విద్యార్థుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి రెండు డోసుల మధ్య ఎక్కువ కాల వ్యవధి ఉంటే యాంటిబాడీలు తొమ్మిది రెట్లు ఎక్కువ అభివృద్ధి చెందే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం వెల్లడించింది. తొలిసారి కరోనా బారిన పడిన వారు ఎనిమిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మంచిదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకూహెచ్ఎస్ఏ) పరిశోధకులు సూచించారు. ఇన్ఫెక్షన్, వ్యాక్సినేషన్ మధ్య సమయంతో సంబంధం లేకుండా రెండో డోసు తర్వాత ప్రతిఒక్కరిలో భారీస్థాయిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని అధ్యయనం పేర్కొన్నది. యూకేలోని దాదాపు 6 వేల మంది హెల్త్‌కేర్ వర్కర్ల యాంటీబాడీల స్థాయిలపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
ఇన్‌ఫ్లూయెంజా వైరల్ ఇన్ఫెక్షన్ కంటే కొవిడ్ మహమ్మారి మూడు రెట్లు ప్రాణాంతకమైనదని స్పెయిన్‌లో ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనాతో దవాఖానాల్లో చేరిన వయోజనులకు ఇన్‌ఫ్లూయెంజా సోకిన వారి కంటే మరణ ముప్పు ఎక్కువగా ఉన్నదని బార్సిలోనా డెల్మార్ దవాఖాన పరిశోధకులు పేర్కొన్నారు. ఇన్ఫ్లూయెంజాతో పోలిస్తే కరోనా రోగులు దవాఖానల్లో, ఐసీయూల్లో ఎక్కువ కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, దాదాపు రెండు రెట్లు అధికంగా కూడా ఖర్చు అవుతుందని తెలిపారు.
యూకేకు చెందిన ఓ వ్యక్తి శరీరంలో కరోనా వైరస్ ఏకంగా 505 రోజులు బతికే ఉంది. ఏడాదిన్నర కాలం పాటు ఏ మందుకు లొంగకుండా చివరికి రోగిని బలి తీసుకొన్నది. శాస్త్రవేత్తల అధ్యయనంతో తాజాగా ఈ విషయం వెల్లడైంది. అప్పటికే ఉన్న ఇతర వ్యాధుల కారణంగా రోగిలో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోయిందని, ఈ కారణంగానే వైరస్ సుదీర్ఘకాలం పాటు బతికి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అవయవ మార్పిడి చేసుకొన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిలోనూ కరోనా వైరస్ ఎక్కువ కాలం బతికి ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.