న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. దీంతో ఇరు దేశాలు పోటాపోటీగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత ఆర్మీకి చెందిన నర్సింగ్ కాలేజీ వెబ్సైట్ హ్యాక్ అయ్యింది. (Army Nursing College Website Hacked) పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్ గ్రూప్ టీమ్ ఇన్సేన్ పీకే ఈ హ్యాకింగ్‌కు పాల్పడింది. ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్సైట్ హ్యాక్ అయినట్లు శుక్రవారం గుర్తించారు. రెండు దేశాల సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలతోపాటు ఇతర విషయాలను హ్యాకర్లు అందులో ఉంచారు. ఆడియో సందేశాలను పోస్ట్ చేశారు.
కాగా, ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌ను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్నది. దీని వెబ్సైట్ హ్యాక్ కావడంపై ఆ సంస్థ స్పందించింది. హ్యాకింగ్‌ను తొలగించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సహాయం తీసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఈ సంఘటన జరుగడం కలకం రేపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల వెబ్సైట్ల భద్రతను మరింతగా పర్యవేక్షిస్తున్నారు.