న్యూఢిల్లీ: ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం ఒక వ్యక్తి జీవితాన్ని అతలాకుతలం చేసింది. చెట్టు కూలి అతడి ఇంటిపై పడింది. దీంతో కుటుంబంలోని వారంతా మరణించారు. భార్యా పిల్లలు చనిపోయారు. పేద కూలీ అయిన అతడు మాత్రమే బతికిబయటపడ్డాడు. (Man Loses Entire Family In Rains) దేశ రాజధాని ఢిల్లీలో ఈ విషాద సంఘటన జరిగింది. శుక్రవారం ఢిల్లీలో కుండపోతగా వర్షం కురిసింది. నజాఫ్‌గఢ్‌లోని ఖర్ఖరి నహర్ గ్రామంలో నివసిస్తున్న 30 ఏళ్ల పేద కూలీ అజయ్ ఇంటిపై వేప చెట్టు కూలింది. ఆ ఇంట్లో నిద్రిస్తున్న అతడి భార్య 28 ఏళ్ల జ్యోతి, ముగ్గురు పిల్లలైన ఏడేళ్ల ఆర్యన్, ఐదేళ్ల రిషబ్, ఏడు నెలల ప్రియాంష్ మరణించారు. గాయపడిన అజయ్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. అకాల వర్షం వల్ల కుటుంబంలోని వారందరినీ కోల్పోయిన అతడు ఒంటరిగా మిగిలాడు.
కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాకు చెందిన అజయ్ పేద వ్యవసాయ కూలీ. ఢిల్లీలోని ఖర్ఖరి నహర్ గ్రామంలోని శిథిలావస్థకు చేరిన చిన్న ఇంట్లో ఐదేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్నాడు. పొలంలో పనులు చేసి జీవిస్తున్నాడు. కష్టపడిన డబ్బును సొంతూరిలో ఉంటున్న భార్యకు పంపేవాడు.
మరోవైపు అజయ్ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సొంత గ్రామానికి వెళ్లాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలోని గ్రామంలో నివసిస్తున్న ఇంటికి తిరిగి వచ్చాడు. ముగ్గురు కొడుకులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారిని స్కూల్లో చేర్పించాడు. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాత మంచి ఇంట్లోకి మారాలని భావించాడు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పాత ఇంటిపై చెట్టు పడింది. ఆ ఇల్లు కూలడంతో అందులో నిద్రిస్తున్న అజయ్ భార్య, ముగ్గురు పిల్లలు మరణించారు. గాయాలతో బయటపడిన అతడు మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నాడు.
మరోవైపు కుటుంబ సభ్యులందరినీ అజయ్ కోల్పోవడం చూసి ఇరుగుపొరుగు వారు చలించిపోయారు. వర్షం అతడి కుటుంబానికి తీవ్ర నష్టం కలిగించిందని వాపోయారు. పొలంలో కష్టపడి పనిచేసే పేద కూలీ, ఇతరులకు సహాయం చేసే అతడికి విధి ఇంత దారుణం చేస్తుందని ఎవరూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతోపాటు సర్వం కోల్పోయిన అజయ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు అభ్యర్థించారు.