అహ్మదాబాద్: ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. బ్రిడ్జి సమీపంలో లభించిన మృతదేహాం అతడిగా ఫ్యామిలీ గుర్తించింది. అంత్యక్రియల తర్వాత ఆ వ్యక్తి జ్ఞాపకార్థం ప్రార్థన ఏర్పాటు చేశారు. అయితే ఇంటికి తిరిగి వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొన్న అతడు అందరికీ షాక్ ఇచ్చాడు. (Gujarat Man) గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 43 ఏళ్ల బ్రిజేష్ సుతార్, అక్టోబర్ 27న నరోడాలోని ఇంటి నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యలు అతడి కోసం అన్నిచోట్లా వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, నవంబర్ 10న సబర్మతి వంతెన సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కుళ్లిపోయిన ఆ మృతదేహాన్ని గుర్తించేందుకు బ్రిజేష్ కుటుంబ సభ్యులను పిలిపించారు. శరీరం ఆకారం పోలి ఉండటంతో అతడిదేనని వారు భావించారు. మృతదేహాన్ని తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు నవంబర్ 15న బ్రిజేష్ సుతార్ జ్ఞాపకార్థం ప్రార్థన ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇందులో పాల్గొన్నారు. ఇంతలో బ్రిజేష్ ఇంటికి తిరిగివచ్చాడు. తన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనలో అతడు పాల్గొన్నాడు. దీంతో బ్రిజేష్ను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. ఆర్థిక బాధలు, మానసిక ఆరోగ్య సమస్యలతో మనస్థాపం చెందిన అతడు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు.
కాగా, బ్రిజేష్ సుతార్ ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలిసి పోలీసులు కంగుతిన్నారు. అయితే ఇన్ని రోజులు అతడు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. మరోవైపు అతడి కుటుంబం అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఎవరిది అన్నది దర్యాప్తు చేస్తున్నారు.