న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో అణ్వాయుధ సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ని భారత్ పరీక్షించింది. 5,400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి గురువారం రాత్రి అగ్ని-5 క్షిపణిని ప్రయోగించి పరీక్షించినట్లు వెల్లడించాయి. అణ్వాయుధ సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణిలోని కొత్త సాంకేతికతలు, పరికరాలను ధృవీకరించడానికి ఈ పరీక్ష నిర్వహించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మునుపటి కంటే మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని ఈ క్షిపణి నిరూపించిందని పేర్కొన్నారు. 2012లో తొలిసారి అగ్ని 5 క్షిపణిని పరీక్షించగా గురువారం తొమ్మిదోసారి దీనిని టెస్ట్ చేశారు.
కాగా, ఈ నెల 9న ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన చైనా సైనికులను భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కర్రలతో దాడి చేసుకోగా ఇరు దేశాలకు చెందిన కొందరు సైనికులు గాయపడ్డారు. ఈ సంఘటన వల్ల భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో చైనా రాజధాని బీజింగ్‌ను చేరుకునే అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని-5 క్షిపణిని రోటీన్‌కు భిన్నంగా రాత్రి వేళ భారత్ పరీక్షించడం విశేషం.