Dawood Ibrahim : దేశంలోని కొందరు యువతను రిక్రూట్ చేసుకుంటున్న దావూద్ గ్యాంగ్ గుట్టు బయటపడింది. ఢిల్లీ స్పెషల్ పోలీసులు, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ ఐఎస్ఐ, అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం గ్యాగ్ కలిసి భారత వ్యతిరేక కుట్రలకు తెరలేపాయి.
దేశంలోని యువతను డబ్బు ఆశ చూపి గ్యాంగ్‌లో చేర్చుకుంటున్నట్లు వెల్లడైంది. ఇటీవల ఢిల్లీ పోలీసులు, మహారాష్ట్ర ఏటీఎస్ కలిసి ముంబై సమీపంలోని భయందర్ ప్రాంతంలో 26 ఏళ్ల హుజైఫా ఫారూక్ అహ్మద్ హష్మి అనే వ్యక్తిని అరెస్టు చేశాయి. అతడిని విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐ, ముంబైకి చెందిన దావూద్ గ్యాంగ్ కలిసి దేశంలోని కొందరు యువతను తమ గ్యాంగ్‌లో చేర్చుకుంటున్నాయి. వారికి డబ్బును ఆశగా చూపుతున్నాయి. అనంతరం అండర్‌వరల్డ్ సిండికేట్‌లో చేర్చుకుని రకరకాల నేరాల్లో భాగస్వాములుగా చేస్తున్నాయి. వీరంతా కలిసి ఢిల్లీలోని ఒక కీలక నేతను లక్ష్యంగా ఎంచుకున్నారు. అయితే, ఆ నేత ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు.
హష్మికి, పాకిస్తాన్‌కు చెందిన యవార్ ఖాన్‌తో సంబంధాలున్నాయి. హష్మికి యవార్ ఖాన్ ఒక కాంటాక్ట్ ఇచ్చాడు. యవార్.. హష్మితోపాటు కుర్లాకు చెందిన సాజిద్, ముంబ్రాకు చెందిన తౌఖిర్లను గ్యాంగ్‌గా ఏర్పాటు చేసి, ఒక ఢిల్లీ నేతను టార్గెట్‌గా ఇచ్చారు. అయితే, వీరందరినీ ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. అయితే, నిందితుల్ని ఢిల్లీ వెళ్లాలని ఆదేశించిన యవార్.. ఆ నేత ఎవరో తమకు ఇంకా చెప్పలేదని వెల్లడించాడు. వీరు ఢిల్లీ చేరుకున్న తర్వాతే టార్గెట్ ఎవరో చెబుతానని యవార్ వివరించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. ఇక, వీరికి డబ్బులు ఎలా వస్తాయి అనే అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. నిందితుల దగ్గరి నుంచి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంది.