జైపూర్, అక్టోబర్ 9: రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో ఓ దళిత మహిళ (25)పై కొందరు కామాంధులు రోజుల తరబడి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రధాన నిందితుడు సంజయ్ శర్మ లైంగికదాడికి పాల్పడి ఆ దృశ్యాన్ని వీడియో తీశాడని, ఆ తర్వాత బాధితురాలిని బెదిరించి డబ్బు వసూలు చేయడంతోపాటు మరికొందరితో కలిసి రోజుల తరబడి అత్యాచారం జరిపాడని అజ్మీర్ నార్త్ డీఎస్పీ చావీ శర్మ ఆదివారం వెల్లడించారు. బాధితురాలికి నిందితులు మత్తు మందు ఇవ్వడంతో తనపై అత్యాచారానికి పాల్పడినవారు ఎందరో ఆమె చెప్పలేకపోతున్నదని వెల్లడించారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే బాధితురాలి పిల్లలతోపాటు భర్తను చంపేస్తామని నిందితులు ఆమెను బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడని, దీంతో నిందితులు గత నెల 27న ఆమెను పోలీస్ స్టేషన్ వెలుపల వదిలేసి వెళ్లారని వివరించారు. దాదాపు నెల రోజుల నుంచి తనను నిర్బంధించి అనేకమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.