Madhya Pradesh | భోపాల్/సాగర్, ఆగస్టు 27: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులు, ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతున్నది. ఆ పార్టీ అధికారంలో ఉన్న యూపీ, మధ్యప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వరుసగా చోటుచేసుకొంటున్న దారుణాలే ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో 20 ఏండ్ల ఓ దళిత యువకుడిని కొంత మంది ఇనుప రాడ్లు, కర్రలతో కొట్టి చంపారు. వారిని అడ్డుకోబోయిన బాధితుడి తల్లిపై కూడా దారుణం ప్రవర్తించారు. ఆమెను వివస్త్రను చేసి దాడి చేశారు. అంతటితో ఆగకుండా బాధితుల ఇంటిని సైతం ధ్వంసం చేశారు. ఈ దారుణం సాగర్ జిల్లాలోని బరోడియా నౌంగర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకొన్నది. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది నింతులను అరెస్టు చేసినట్టు సాగర్ జిల్లా పోలీసులు ఆదివారం వెల్లడించారు.
కేసు వెనక్కి తీసుకోలేదని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడైన విక్రమ్ సింగ్ కొంత మంది గుంపుతో నితిన్ అహిర్వార్ అనే దళిత యువకుడికి ఇంట్లోకి గురువారం రాత్రి సమయంలో చొరబడ్డారు. 2019లో అహిర్వార సోదరి తమపై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనికి నితిన్ అహిర్వార్ తిరస్కరించడంతో.. నిందితుల మూక బాధితుడిని కొట్టిచంపారు. అడ్డుకోబోయిన తల్లిపై అమానవీయంగా ప్రవర్తించారు. వివస్త్రను చేసి ఆమె పైనా దాడి చేశారు.
తలకిందులుగా వేలాడదీసి దళితులపై దాడి
ముంబై, ఆగస్టు 27: దొంగతనం చేశారన్న ఆరోపణపై నలుగురు దళిత యువకులను కొందరు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి హింసించిన ఘటన బీజేపీ పాలిత మహారాష్ట్రలో చోటుచేసుకుంది. అహ్మద్‌నగర్ జిల్లా హరెగావ్ గ్రామంలో మేకను, పావురాలను అపహరించారన్న అనుమానంతో నలుగురు యువకులను ఆరుగురు వ్యక్తులు ఇళ్లనుంచి లాక్కొచ్చి చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు శనివారం ఆరుగురు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరు తీవ్రంగా గాయపడటంతో అతడిని దవాఖానకు తరలించామని తెలిపారు.