Rajasthan | ఫతేపూర్, ఏప్రిల్ 20: దళిత యువకుడిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసి కులం పేరుతో దూషించి అవమానించడమే కాక లైంగిక దాడికి పాల్పడిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఫతేపూర్‌లోని సికార్‌లో ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 19 ఏండ్ల దళిత యువకుడు ఒక పెండ్లి ఊరేగింపును తిలకిస్తుండగా, మద్యం సేవించి ఉన్న ఇద్దరు వ్యక్తులు అతడిని బెదిరించి నిర్జన ప్రదేశంలోకి తీసుకుపోయి, కులం పేరుతో దూషించారు.
అతడి బట్టలు విప్పించి దారుణంగా కొట్టడమే కాక, అతనిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాన్ని మొబైల్లో రికార్డు చేసి ఎవరికైనా చెబితే దానిని వైరల్ చేస్తామంటూ బెదిరించారు. దీనిపై ఆలస్యంగా ఆ యువకుడి తల్లిదండ్రులు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితికి ఈ దారుణం అద్దం పడుతున్నదని విపక్ష నేత టికారామ్ జుల్లి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆరాతీసి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.