పాట్నా: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనకు అవమానం జరిగిందని దళిత నేత భూదేవ్ చౌదరి ఆరోపించారు. తన తండ్రి, స్వాతంత్య్ర సమర యోధుడు జగ్లాల్ చౌదరి జయంత్యుత్సవాలకు రాహుల్ గాంధీ హాజరయ్యారని చెప్పారు. తాను రాహుల్‌ను వేదికపై కలిసేందుకు ప్రయత్నించానని, కానీ తనకు భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తన తండ్రి జయంత్యుత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఫంక్షన్లో తనకు గౌరవం ఇవ్వలేదని ఆయన వాపోయారు. దీనిపై బీహార్ పీసీసీ చీఫ్ అఖిలేశ్ ప్రసాద్ సింగ్ స్పందిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిందని, దీనిలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని చెప్పారు. భూదేవ్కు అవమానం జరగడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. బీజేపీ నేత నీరజ్ కుమార్ స్పందిస్తూ, దళితుల పట్ల కాంగ్రెస్ నేతల వైఖరి స్పష్టమైందని వ్యాఖ్యానించారు.