అమేథీ/సుల్తాన్పూర్, అక్టోబర్ 9: ఉత్తరప్రదేశ్లో దళితులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అమేథీ జిల్లాలోని జామోలో 15 ఏండ్ల దళిత బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఈ నెల 3న చోటుచేసుకున్నదని పోలీసులు ఆదివారం తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన బాలికపై దుర్గా పూజా మండపాలకు సంగీత ఏర్పాట్లు చేసే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నిందితుడిని మోనుగా గుర్తించామని, అతడిని అరెస్ట్ చేసినటు ్టజామో స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అఖిలేశ్ గుప్తా తెలిపారు. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, పోస్కో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై కారులో..
సుల్తాన్పూర్ జిల్లా జైసింగ్పూర్లో ఓ బీటెక్ విద్యార్థినిపై కారు డ్రైవర్ లైంగికి దాడికి పాల్పడ్డాడు. 23 ఏండ్ల బీటెక్ విద్యార్థిని ఇంటికెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం లిఫ్ట్ అడిగి, ఎస్యూవీ కారు ఎక్కింది. ఆ యువతిపై కారులోనే డ్రైవర్ లైంగికదాడి చేశాడు. అనంతరం ఆమెను కాలువ వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె ఇంటికి చేరుకొన్నాక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఓ వృద్ధురాలి కాళ్లు నరికి..
జైపూర్: రాజస్థాన్లో ఆదివారం మరో దారుణం జరిగింది. జైపూర్లో దాదాపు 100 ఏండ్ల వయసున్న ఓ వృద్ధురాలి వెండి ఆభరణాలను దొంగిలించేందుకు కొందరు దుర్మార్గులు ఏకంగా ఆమె కాళ్లనే తెగనరికేశారు. తమ భూస్వామి సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన గురించి తెలిసిందని బాధితురాలి మనవరాలు చెప్పారు. ఇంటి వెలుపల విషమ పరిస్థితిలో పడి ఉన్న ఆ వృద్ధురాలి కాళ్లు తెగిపోవడంతోపాటు మెడపై తీవ్ర గాయాలున్నాయని బాధితురాలి కుమార్తె తెలిపారు.