Dalai Lama | టిబెటన్ బౌద్ధ గురువు దలైలామాకు తన వారసుడిని ఎంపిక చేసే ప్రక్రియను నిర్ణయించే అధికారం లేదని బీజింగ్ మరోసారి స్పష్టం చేసింది. ఈ క్రమంలో భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. టిబెట్ బౌద్ధ గురువు పునర్జన్మ విధానాన్ని ఆయన నిర్ణయించకూడదని పేర్కొన్నారు. టిబెటన్ బౌద్ధమతంలో ‘లివింగ్ బుద్ధాల’ పునర్జన్మ అనేది 700 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఒక చారిత్రక, మతపరమైన సంప్రదాయమని జు ఫెయిహాంగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవస్థను కొనసాగించాలా? వద్దా ? అని నిర్ణయించే అధికారం 14వ దలైలామాకు లేదన్నారు.
చైనా చట్టాలు, మతపరమైన ఆచారాల ప్రకారమే పునర్జన్మ ప్రక్రియ జరగాలని చైనా విదేశాంగ శాఖ కూడా గతంలోనే తేల్చి చెప్పిందన్నారు. టిబెటిన్ బౌద్ధంలో ఓ ప్రత్యేకమైన విధానంలో వారసుడి ఎంపిక జరుగుతుందని.. లివింగ్ బుద్ధ విధానంలో దాదాపు 700 సంవత్సరాలుగా పునర్జన్మ విధానం కొనసాగుతోందని.. ప్రస్తుతం చైనాలోని జిజాంగ్, టిబెట్, సిచువాన్, యునాన్, గన్సు, క్వింగ్‌హాయ్ ప్రావిన్స్‌ల్లో దాదాపు వెయ్యి రకాల పునర్జన్మ విధానాలను అనుసరిస్తున్నారన్నారు. సుదీర్ఘ చారిత్రక సంప్రదాయానికి 14వ దలైలామా ఓ భాగమని.. అంతకంటే ఎక్కువ కాదని.. ఆ సంప్రదాయాలు ఆయనతోనే మొదలు కాలేదని.. ఆయనతోనే అంతం కావన్నారు.
దలైలామా వారసుడి ఎంపికపై భారత్ తన వైఖరిని ప్రకటించిన తర్వాత చైనా రాయబారి స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 2న కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ ఆచారాలను కొనసాగించే హక్కు దలైలామాకు ఉందని పేర్కొన్నారు. దలైలామా పునర్జన్మ పూర్తిగా మతపరమైన అంశమని, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు కేవలం ఆయనకు, బౌద్ధ సంప్రదాయాలకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతరుల జోక్యానికి తావు లేదని ఆయన అన్నారు. చైనా చేస్తున్న వాదనలకు కౌంటర్ ఇచ్చినట్లయ్యింది. ఆదివారం (జులై 6న) దలైలామా 90వ పుట్టిన రోజు కాగా.. ఇదే రోజున ఈ అంశాన్ని చైనా తెరపైకి తీసుకువచ్చింది.