Rajnath Singh : భారతదేశం రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకొనే దిశగా కీలక ముందడుగు పడింది. ఆధునిక పరిస్థితులకు తగ్గట్టుగా సైనిక అవసరాల కోసం భారీగా యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) ఆమోదం తెలిపింది. రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాలను కొనేందుకు రక్షణ శాఖకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని శుక్రవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఆధునిక కాలానికి తగ్గట్టుగా భారత దేశ సైనిక శక్తిని, తెగువను దుర్భేద్యంగా మార్చుకునే దిశగా మరో అడుగు పడింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ శుక్రవారం రూ.2.38 లక్షల కోట్ల యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త విమానాల కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదన (యాక్సెప్టన్స్ ఆఫ్ నెస్సెసిటీ)కు డీఏసీ అంగీకరించింది. దాంతో, సైన్యం, వాయుసేన, కోస్ట్ గార్డ్ విభాగానికి అవసరమైన యుద్ధ విమానాలను కొనే ప్రక్రియ వేగవంతం కానుంది.
Chaired the Defence Acquisition Council (DAC) meeting today in which Acceptance of Necessity (AoN) was accorded to various proposals worth an estimated cost of about Rs 2.38 lakh crore. The decisions taken in the DAC will help in further strengthening India’s defence…
— Rajnath Singh (@rajnathsingh) March 27, 2026
‘ఈరోజు డీఏసీ సమావేశానికి అధ్యక్షత వహించాను. ఈ సందర్భంగా సైన్యం అవసరాల నిమిత్తం రూ.2.38 లక్షల కోట్లతో యుద్ధ విమానాల కొనుగోలుకు అమోదం లభించింది. డీఏసీలో తీసుకున్న ఈ నిర్ణయం భారత దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది. భారత సైన్యంకోసం ఎయిర్ డిఫెన్స్ ట్రాక్డ్ సిస్టమ్, ఆర్మౌర్డ్ పియెర్సింగ్ ట్యాంక్ అమ్మునిషన్, అత్యధిక సామర్ధ్యం కలిగిన రేడియో రీలే, ధనుష్ గన్ వ్యవస్థ, స్వతంత్ర నిఘా వ్యవస్థతో కూడిన రన్‌వే.. వంటి వాటికి డీఏసీలో ఆమోదం లభిచింది’ అని రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ పోస్ట్‌లో పోస్ట్ చేశారు. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రక్షణ శాఖకు సంబంధించిన ఆమోదాలు, ఒప్పందాలు రికార్డు స్థాయికి చేరాయని ఆయన తెలిపారు.ఇప్పటివరకూ రూ.6.73 లక్షల కోట్ల ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.
భారత సైన్యం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాతకాలపు ఏఎన్32, ఏఎల్76 యుద్ధ విమనాల స్థానంలో మధ్య తరహా రవాణా యుద్ధ విమనాలు రాబోతున్నాయి. గగనతల మిసైల్ వ్యవస్థ పటిష్టం కోసం రష్యాకు చెందిన ఎస్-400 విమానాలు కొనేందుకు డీఏసీ ఓకే చెప్పింది. వీటి సాయంతో అధునాతన గగనతల దాడుల ముప్పును సమర్ధంగా ఎదుర్కోవడం, సంక్షిష్టమైన లక్ష్యాలను ఛేదించడం సాధ్యపడనుంది.
రిమోటెడ్ పైలట్ ఎయిర్‌క్రాఫ్ట్స్.. సు-30 ఏరో ఇంజన్ అగ్రిగేట్స్ కూడా భారత సైన్యం అమ్ములపొదిలో చేరనున్నాయి. కోస్ట్ గార్డ్ విషయానికొస్తే.. హెవీ డ్యూటీ ఎయిర్ కుషన్ వెహికిల్స్ కొనుగోలకు డీఏసీ పచ్చజెండా ఊపింది. ఈ వాహనాలు తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహణకు, వెతకడాని, సహాయక చర్యలు చేపట్టేందుకు తోడ్పడుతాయి.