Cyclone Dana | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను తీరం దిశగా దూసుకు వస్తున్నది. నేటి రాత్రి, శుక్రవారం వేకువ జామున ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫానుకు ‘దానా’గా నామకరణం చేశారు. ప్రస్తుతం, ఈ పేరు ఎవరు పెట్టారు? ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకునేందుకు తెగ వెతుకున్నారు. ‘దానా’ అరబిక్ పదం. ఈ పేరును ఖతార్ ప్రతిపాదించింది. అరబిక్‌లో దానా అన్న పదానికి అత్యంత సంపూర్ణ పరిమాణం, అందమైన ముత్యం, విలువైనది అనే అర్థాలు ఉన్నాయి. ‘దానా’ అని ఎక్కువగా మహిళలకు పేర్లు పెడుతుంటారు. అరబ్ దేశాల్లో ఎక్కువగా ఈ పేరు కనిపిస్తుంది.
పర్షియన్ భాషలో ‘దానా’ అంటే విరాళం అనే అర్థం ఉన్నది. ఈ తుఫానులకు పేరు పెట్టే సాంప్రదాయాన్ని అమెరికా ప్రారంభించింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. వేర్వేరు తుఫానులు వచ్చిన సమయంలో సులభంగా గుర్తించడంతో పాటు వాతావరణశాఖవేత్తలు, మీడియా ప్రజలకు సమాచారాన్ని సమర్థవంతంగా అందించడంతో పాటు హెచ్చరికలు చేసేందుకు ఉపయోగపడుతాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు పేర్లు పెట్టే పెట్టేందుకు ఏప్రిల్ 2020లో 13 దేశాలు గ్రూప్‌గా ఏర్పాటయ్యాయి. ఈ దేశాల్లో భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, శ్రీలంక, థాయ్‌లాండ్ తదితర దేశాలున్నాయి. ఆయా దేశాలు తమ సంస్కృతికి అనుగుణంగా పేర్లను ప్రతిపాదిస్తుంటాయి.
అయితే, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టే బాధ్యత ఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రానికి ఉంటుంది. ఇప్పటి వరకు 169 పేర్లతో జాబితాను సిద్ధం చేశారు. పేర్లు వీలైనంత వరకు చిన్నగా ఉండాలి.. అదే సమయంలో ఒక దేశ సంస్కృతితో ఎట్టి పరిస్థితుల్లోనూ ముడిపడి ఉండకుండా చూడాల్సి ఉంటుంది. అలాగే, పెడర్థాలు వచ్చేలా ఉండకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఒకసారి ఒక తుఫానుకు పేరును పెట్టాక.. మళ్లీ ఆ పేరును ఉపయోగించరు. పేర్లు పలికేందుకు సులభంగా ఉండడంతో పాటు ఏ వర్గాన్ని కించపరచకుండా ఉండాలని, రాజకీయాలు, రాజకీయ వ్యక్తులు, మత విశ్వాసాలతో ముడిపెట్టకూడదని సూచనలు చేసింది. ఈ ప్రమాణాలకు అనుగుణంగా దేశాలు పేర్లను సూచిస్తుంటాయి. ఈ క్రమంలో ‘దానా’ పదాన్ని ఖతార్ ప్రతిపాదించింది. గతంలో వచ్చిన తుఫాన్లకు ఫణి, నిలోఫర్, మాలా, హెలెన్, అగ్ని, జలి, బిజిలి, ఆకాశ్ పేర్లను భారత్ సూచించింది.