అహ్మదాబాద్, జూలై 29: దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఓ వైద్యురాలిని మూడు నెలలకు పైగా డిజిటల్ అరెస్ట్ చేసిన కేటుగాళ్లు.. ఆమె నుంచి ఏకంగా రూ.19 కోట్లు కాజేశారు. ఆమె బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయించారు. ఆస్తులు అమ్మించారు. ఆఖరికి ఆమె నగలు కూడా తాకట్టు పెట్టించి ఆమెను నిలువునా దోపిడీ చేశారు. దేశంలోని అతిపెద్ద డిజిటల్ అరెస్ట్‌లలో ఇది ఒకటని అధికారులు తెలిపారు. గుజరాత్ సీఐడీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాంధీనగర్‌కు చెందిన ఒక మహిళా డాక్టర్‌కు మార్చి 15న ఒక ఫోన్‌కాల్ వచ్చింది. అమె ఫోన్లో అభ్యంతరకర కంటెంట్‌ను గుర్తించామని, ఆమె ఫోన్ కనెక్షన్‌ను డిస్కనెక్ట్ చేయడమే కాక, ఆమెపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేస్తామని దుండుగులు ఆమెను బెదిరించారు.
ఇన్స్పెక్టర్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, ఇతర అధికారులుగా పేర్కొంటూ తరచూ ఆమెకు పలువురు వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించడమే కాక, ఆమెను క్రమంగా డిజిటల్ అరెస్ట్ చేశారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. వారి బెదిరింపులు, డిమాండ్లకు లొంగిన ఆ డాక్టర్ తన జీవిత కాల సేవింగ్స్‌ను, ఆస్తులను అమ్మి రూ.19 కోట్లను వారు చెప్పిన 35 బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు. ఆఖరికి ఆమె నగలు కూడా తాకట్టు పెట్టి అప్పు తీయించి, ఆ మొత్తాన్ని వారి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.
ఆమెను డిజిటల్ అరెస్ట్‌లో ఉంచేవారు. ఆమె బయటకు వెళ్లేటప్పుడు వీడియో కాల్స్ చేసి తన కదలికలు వారికి చెప్పేలా భయపెట్టారు. ఇలా ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేశారు. ఒక రోజు హఠాత్తుగా వారి నుంచి ఫోన్‌కాల్స్ ఆగిపోయాయి. బాధితురాలు వారి గురించి తన బంధువులకు చెప్పగా, అది మోసమని వారు చెప్పడంతో అప్పటికి ఆమెకు నిజం బోధపడింది. అయితే అప్పటికే ఆలస్యమైంది. జూలై 16న ఆమె గుజరాత్ సీఐడీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఒక వ్యక్తిని పట్టుకుని అతని నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసానికి పాల్పడిన మాస్టర్ మైండ్, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు.