Cyber Attack | ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సీ) భారత ప్రభుత్వ వెబ్సైట్లకు సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12వేల వెబ్సైట్లను ఇండోనేషియా హ్యాకర్ గ్రూప్ టార్గెట్ చేశాయని, ఈ గ్రూప్‌తో ఆయా సైట్లకు ముప్పు ఉందంటూ 14సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కి హెచ్చరికలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సూచనలు చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సైట్ల దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున.. నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పింది.
గతేడాది రాన్సమ్వేర్ దాడి కారణంగా ఆల్ ఇండియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యవస్థను కుప్పకూల్చింది. ఆసుపత్రి సేవలతో పాటు కేంద్రీకృత రికార్డులను సైతం యాక్సెస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. 2022లో వివిధ ప్రభుత్వ సంస్థలకు చెందిన 19 వెబ్సైట్లపై రాన్సమ్ దాడులు జరిగాయి. ఆయా సైట్లపై ఇండోనేషియా ‘హాక్టివిస్ట్’ సంస్థ డిస్ట్రిబ్యూటెడ్ డినియల్ ఆఫ్ సర్వీస్ (DDoS), డినియల్ ఆఫ్ సర్వీస్ (DoS) దాడులను నిర్వహిస్తున్నట్లుగా హెచ్చరించింది. అయితే, హ్యాక్టివిస్ట్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా పేర్కొన్న వెబ్సైట్ల జాబితా వెలుగు చూసింది.
దాంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వెబ్సైట్లు ఉన్నాయి. బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపూర్ శర్మ మహ్మద్ ప్రవకర్తపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలేషియా హ్యాక్టివిస్ట్ ముఠాలు గత ఏడాది భారత ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా దాడికి పాల్పడ్డాయి. సైబర్ సెక్యూరిటీ కంపెనీ పింగ్‌సేఫ్ (PingSafe) సీఈవో ఆనంద్ ప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం అన్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లు కొనసాగుతున్నాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా కనిపించే ఏదైనా లింక్, ఈమెయిల్‌ను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని సూచించారు. దాంతో వైబ్సైట్ల భద్రత ప్రమాదంలో పడుతుందన్నారు.