CWC meeting : మహారాష్ట్ర (Maharastra), హర్యానా (Haryana) రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress party) ఘోర పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం కాబోతోంది. ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని అగ్ర నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు.
మహారాష్ట్ర, హర్యానాల్లో గెలిచేందుకు మంచి అవకాశాలున్నా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడగానికి కారణాలు ఏమిటి..? లోపాలు ఎక్కడున్నాయ్..? అనే అంశాలు సీడబ్ల్యూ సమావేశంలో చర్చకు రానున్నాయి. అదేవిధంగా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాలను చవిచూసింది.
ఆ రెండు రాష్ట్రాల్లోనూ గెలుపు తమదేనన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. హర్యానాలో పూర్తిగా అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినా.. ఆ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. మహారాష్ట్రలో కూడా మహాయుతి కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కానీ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది.