CTET 2023 | కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ నియామకాలకు ప్రతియేటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రతియేటా నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్- 2023) నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే జూలై-ఆగస్టు మధ్య కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్ఈ గురువారం తెలిపింది. పరీక్షల నిర్వహణ తేదీలను అడ్మిట్ కార్డుల్లో పొందుపరుస్తామని పేర్కొంది.
ఆసక్తి గల వారు గురువారం వచ్చేనెల 26 అర్థరాత్రి 11.59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చని సీబీఎస్ఈ తెలిపింది. ఓబీసీ, జనరల్ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000/ ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.500, రెండు పేపర్లకు రూ.1200/రూ.600 పరీక్ష ఫీజు చెల్లించాలని వెల్లడించింది. ఈ పరీక్షలో వచ్చే మార్కులను కేంద్ర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
ప్రతియేటా రెండు సార్లు సీటెట్ నిర్వహిస్తారు. ఇప్పుడు 17వ ఎడిషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్లను సీబీఎస్ఈ ఆహ్వానిస్తున్నది. రెండు పరీక్షల్లో పేపర్-1.. ఐదో తరగతి వరకు, పేపర్-2.. ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బోధించాలని కోరుకునే అభ్యర్థులు రాయొచ్చు. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్ జీవిత కాలమంతా చెల్లుబాటవుతుంది. 20 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది.