జమ్ము: జమ్ముకశ్మీర్‌లో వరుస దాడులతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సోమవారం ఉదంపూర్ జిల్లాలో గస్తీ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కుల్దీప్ కుమార్ మరణించాడని అధికారులు వెల్లడించారు. బసంత్‌గఢ్‌లోని దూదే ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం లోకల్ పోలీసులతో కలిసి గస్తీగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారని చెప్పారు.
కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన ఇన్స్పెక్టర్కు బుల్లెట్ గాయాలయ్యాయని, దవాఖానకు తరలిస్తుండగా ఆయన మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. జమ్ము రీజియన్‌లో ఉగ్రవాదాన్ని పెంచేందుకు పాకిస్థాన్ గత కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నది.
ఐదు రోజుల క్రితం దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో మొత్తం 74 మంది ప్రాణాలు కోల్పోగా, ఇందులో 21 మంది భద్రతా బలగాలకు చెందినవారు కాగా, 35 మంది టెర్రరిస్టులున్నారు.