భోపాల్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) జవాన్ తన భార్యను గన్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (CRPF Jawan Kills Wife, Shoots Himself) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. బంగ్రాసియా ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ బేస్‌లో 35 ఏళ్ల రవికాంత్ వర్మ జవాన్‌గా పనిచేస్తున్నాడు. మిస్రోడ్ ప్రాంతంలోని అద్దె ఫ్లాట్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.
కాగా, బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సీఆర్పీఎఫ్ జవాన్ రవికాంత్ ఫోన్ చేశాడు. తన భార్య రేణు వర్మను కాల్చి చంపినట్లు చెప్పాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకున్నాడు.
మరోవైపు పోలీసులు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. జవాన్, అతడి భార్య రక్తపు మడుగులో పడి ఉండటం చూశారు. వారి పిల్లలైన రెండున్నర ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఒక గదిలో ఏడుస్తుండటాన్ని గమనించారు.
కాగా, మృతదేహాల దగ్గర పడి ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం భోపాల్ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ కేసుపై దర్యాప్తు కోసం సీఆర్పీఎఫ్ సహాయాన్ని కోరతామని పోలీస్ అధికారి వెల్లడించారు.