ఢిల్లీ: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar)పై ఆపరేషన్ సిందూర్ ప్రభావం పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టుల కోసం కర్రెగుట్టలను జల్లడపడుతున్న సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్ర హోంశాఖ దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నది. దాదాపు ఐదు వేల మందికి పైగా బలగాలను కేంద్రం వెనక్కి పిలిపిస్తున్నది. ఇందులో భాగంగా తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సీఆర్పీఎఫ్ కోబ్రా జవాన్లు తమ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలోని వెంకటాపురం, ఆలూబాక, వీరభద్రవరం, పామునూరు పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు వీరంతా సరిహద్దుల్లోకి వెళ్లనున్నారు. అయితే ఛత్తీసగఢ్ వైపు ఆపరేషన్ కగార్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది.