న్యూఢిల్లీ, మే 31: ఇప్పుడు దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ వివాదం పెద్ద దుమారమే రేపుతున్నది. దేశ అత్యున్నత విద్యాబోర్డును జెన్ జీ కిడ్స్ ఏకిపారేస్తున్నారు. ప్రశ్నలు, విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సీబీఎస్ఈ అసమర్థతను మొత్తం ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పెడుతున్నారు. సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో లోపాలున్నాయని 19 ఏండ్ల ఎథికల్ హ్యాకర్ నిసర్గ అధికారి బయటపెట్టడంతో వివాదం మొదలైంది. ఆన్సర్ షీట్లు ఎవరైనా ఈజీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ డొమైన్లో పొందుపరిచారని.. ఇది సురక్షితం కాదని నిసర్గ వెల్లడించాడు. అంతే కాకుండా తన ఎక్స్ పోస్టులో ఆన్సర్ షీట్లు కూడా కనిపిస్తున్నట్టు పోస్టు పెట్టడంతో సోషల్ మీడియాలో సీబీఎస్ఈని జెన్‌జీ కిడ్స్ ఏకిపారేస్తున్నారు.
అది సురక్షితం కాదు: నిసర్గ
సీబీఎస్ఈ అధికారులు తమ ఏడబ్ల్యూఎస్ బకెట్‌ను సరిగ్గా కాన్ఫిగర్ చేయలేదని.. ఇప్పుడు ఎవరైనా 2026 ఆన్సర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చంటూ నిసర్గ అధికారి ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఆన్సర్ షీట్ల ఫొటో కూడా పెట్టాడు. దీంతో జెన్ జెడ్ జీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కొత్తగా బ్యాడ్ ఆపిల్, యానిమేషన్ రన్నింగ్ ఆన్ సీబీఎస్ఈ రన్నింగ్ పోర్టల్ లాంటివి పోర్టల్‌లోని లోపాలను చూపిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో జెన్‌జీ కిడ్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర అత్యున్నత విద్యా సంస్థ నిర్వహించే పోర్టల్ ఇంత వీక్‌గా ఉంటే.. ఇక దేశం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీబీఎస్ఈ మొదట డమ్మీ పోర్టల్‌ను హ్యాక్ చేసినట్టు చెప్పి.. ఇప్పుడేమో అధికారిక పోర్టల్‌లో లోపాలున్నాయంటూ పోస్ట్ చేయడం వెనక అసమర్థత బయటపడుతున్నదని జెన్‌జీ మండిపడుతున్నది. సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ ఆవిష్కరణను వాయిదా వేయడం వెనక ఏదో కుట్ర ఉందంటున్నారు నెటిజన్లు. మొత్తంగా పోర్టల్ వివాదంతో సీబీఎస్ఈ లోపాలు మొత్తం బయటపడుతున్నాయి.
పోర్టల్‌లో లోపాలు నిజమే
ఆన్ స్క్రీన్ మార్కింగ్ వివాదంపై మొత్తానికి సీబీఎస్ఈ యూటర్న్ తీసుకుంది. మొన్నటి దాకా పోర్టల్‌లో ఎలాంటి సమస్యలు లేవని చెప్పిన బోర్డు.. తాజాగా ఆన్లైన్ పోర్టల్‌లో లోపాలు ఉన్నట్టు ఒప్పుకుంది. ఈ మేరకు తాజాగా ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో లోపాలున్నట్టు మేం గుర్తించాం. వాటిని నిశితంతా పరిశీలిస్తున్నాం. వివిధ శాఖలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు, అలాగే ఐఐటీలు కలిసి కొన్ని రోజులుగా పోర్టల్‌కు సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయడానికి పనిచేస్తున్నారు. అలాగే గుర్తించిన లోపాలను నియంత్రించాం. ప్రస్తుతం ఓఎస్ఎమ్ పోర్టల్‌కు మరింత సెక్యూరిటీ సెటప్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని బోర్డు వెల్లడించింది.
హ్యాకర్లకు థాంక్స్..
ఓఎస్ఎమ్ పోర్టల్‌లో లోపాలున్నట్టు గుర్తించి తమను అలర్ట్ చేసిన ఎథికల్ హ్యాకర్లు, విద్యార్థులకు సీబీఎస్ఈ థాంక్స్ తెలిపింది. వారందరినీ ఇప్పటికే నేరుగా సంప్రదించి ప్రశంసించామని సీబీఎస్ఈ వెల్లడించింది. ఇంకా ఎవరైనా పోర్టల్‌లో లోపాలను గుర్తిస్తే తమ సైబర్ సెక్యూరిటీ టీమ్‌కు వివరించాలని సీబీఎస్ఈ కోరింది. 19 ఏండ్ల నిసర్గ అధికారి ఈ పోర్టల్‌ను హ్యాక్ చేశానని, లోపాలున్నాయని గుర్తించి చెప్పిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. ముందు బోర్డు వాటిని ఖండించినా.. చివరకు లోపాలున్నట్టు ఒప్పుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.