G20 Summit | న్యూఢిల్లీ: దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్‌లో భారత్‌పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కానిదానికీ ఇలా ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించడం పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని నిపుణులు వాదిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. సైబర్ సెక్యూరిటీపై ఇటీవల జరిగిన జి20 సమ్మిట్‌లో భారత్ తీరుపై చర్చ జరిగింది. ‘ఇంటర్నెట్ గవర్నెన్స్ నేషనల్ రెస్పాన్సిబిలిటీ అండ్ గ్లోబల్ కామన్స్’పై జరిగిన చర్చా కార్యక్రమంలో ‘ఫ్రీ అండ్ ఓపెన్‌సోర్స్ సాఫ్ట్వేర్’ (ఎఫ్‌వోఎస్ఎస్) కార్యకర్త, ప్యానలిస్ట్ ఎన్నీనా ఎన్వకాన్మా మాట్లాడుతూ.. నిషేధం ద్వారా ఆర్థికపరంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవని పేర్కొన్నారు. నిషేధించాల్సి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నెట్ సేవలపై నిషేధం అత్యంత ప్రమాదకరమైనదని హెచ్చరించారు. మరోవైపు భారతదేశం ప్రపంచంలోనే ఇంటర్నెట్ షట్‌డౌన్ రాజధానిగా అవతరించిందని ‘యాక్సెస్ నౌ’అధ్యయనం పేర్కొంది.
‘షట్‌డౌన్ ట్రాకర్ ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ (ఎస్టీవోపీ డాటాబేస్) ప్రకారం 2016 నుంచి డాక్యుమెంట్ చేసిన ఇంటర్నెట్ షట్డౌన్లలో ఇండియా దాదాపు 58 శాతం వాటాను కలిగి ఉంది. రెండుసార్లకు మించి ఇంటర్నెట్ను మూసేసిన ఏకైక జీ20 దేశం భారత్ మాత్రమే. 2022లో రష్యాలో రెండుసార్లు, బ్రెజిల్లో ఒకసారి మాత్రమే ఇంటర్నెట్ను షట్‌డౌన్ చేశారు. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో మే 3న ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తాజాగా ఈ నిషేధాన్ని మరో ఐదు రోజులపాటు పొడిగించారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలంటూ మణిపూర్ ప్రజలు, పలు సంస్థలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం నిషేధాన్ని తొలగించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేస్తూ.. ఇంటర్నెట్ను ఎప్పుడు పడితే అప్పుడు మూసివేసే ఏకైక ప్రజాస్వామ్య దేశం భారతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్నెట్ను నిషేధిస్తే అల్లర్లు అదుపులోకి వస్తాయని అనుకోవడం అపోహేనని, లాభాల కంటే నష్టాలే ఎక్కువని పేర్కొన్నారు.