ముంబై, జూన్ 9: కేంద్ర ప్రభుత్వం లెక్కించిన పంట ఉత్పత్తి వ్యయానికి, వాస్తవంగా రైతులు ఖర్చు చేస్తున్నదానికి చాలా వ్యత్యాసం ఉందని క్రిసిల్ నివేదిక పేర్కొన్నది. వానకాల సీజన్‌కు సంబంధించి 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన సమయంలో… రైతుల పంట ఉత్పత్తి వ్యయం మూడు శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. పెరిగిన వ్యయానికి రెట్టింపుతో మద్దతు ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది. 14 రకాల పంటలకు సగటున 6% ఎంఎస్పీని పెంచింది. అయితే, పంట ఉత్పత్తి వ్యయం కిందటేడాదితో పోలిస్తే కేంద్రం చెప్పినట్టు 3 శాతం కాకుండా 5% పెరిగిందని క్రిసిల్ వెల్లడించింది.
ఉత్పత్తి వ్యయం పెరగడానికి కారణం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగదలే అని తెలిపింది. ఈ లెక్కను పరిగణనలోకి తీసుకొంటే మద్దతు ధరను ఇంకా పెంచాల్సి ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత మే నెలలో మార్కెట్ విలువతో పోల్చుకొంటే ఈ 14 పంటల మద్దతు ధరలు 47% తక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. మరోవైపు, కేంద్రం 14 పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నా వాస్తవంలో కేవలం వరి, పత్తిని మాత్రమే చెప్పుకోదగిన పరిమాణంలో సేకరిస్తున్నారని క్రిసిల్ చెప్పింది. మొత్తం వరి ఉత్పత్తిలో 45%, పత్తి ఉత్పత్తిలో 27శాతాన్ని మాత్రమే మద్దతు ధరలకు కొంటున్నారని, మిగతా పంటను రైతులు మార్కెట్లో అమ్ముకొంటున్నారని వెల్లడించింది.