హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రైలు టికెట్ల బుకింగ్, రైళ్ల ట్రాకింగ్, ఫుడ్ డెలివరీ లాంటి సేవలన్నింటినీ ఒకేచోట అందించేందుకు ఇండియన్ రైల్వే ఓ ‘సూపర్ యాప్’ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం రిజర్వేషన్ టికెట్ల బుకింగ్‌కు ‘రైల్ కనెక్ట్’ యాప్, జనరల్ టికెట్లను కొనుగోలు చేసేందుకు ‘యూటీఎస్’ యాప్, ఫిర్యాదులు స్వీకరించేందుకు ‘రైల్ మదద్’ యాప్, రైళ్ల ట్రాకింగ్‌కు ‘ఎన్టీఈఎస్’ యాప్ అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నది.
ఈ నేపథ్యంలో ఈ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నది. అందులో భాగంగా ఓ సూపర్ యాప్‌ను రూపొందిస్తున్నది. ఇండియన్ రైల్వేకు సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం ఈ సూపర్ యాప్ ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం రైల్వే శాఖ ఏకంగా రూ.90 కోట్లు వరకు వెచ్చించనున్నట్టు సమాచారం. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) ఈ సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఇది అందుబాటులోకి వస్తే రైలు ప్రయాణికులు వేర్వేరు యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రైల్వే సేవలన్నీ సూపర్ యాప్‌లోనే లభిస్తాయి.