Crime News : పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలో తాజాగా మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే ఇంకో ఘోరం చోటుచేసుకుంది. బెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata) లో వికలాంగురాలిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి పోర్ట్ డివిజన్లోని నైదాల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. శనివారం ఉదయం నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నిందితుడి వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు.
శనివారం సాయంత్రం అతడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. కాగా, గతంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో వైద్యవిద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటన తాలూకూ చేదు జ్ఞాపకాలను మరువకముందే.. తాజాగా ఒకే రోజు రెండు జరిగాయి. ఒకటి వికలాంగురాలిపై అత్యాచారం కాగా, మరొకటి ఒడిశా నుంచి వచ్చిన వైద్యవిద్యార్థినిపై అత్యాచారం. రెండో ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.