Crime news : అనుమానం పెనుభూతమై ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను తలపై సుత్తితో కొట్టి చంపాడు. ఇద్దరు పిల్లలను తల్లిలేని వాళ్లను చేశాడు. నోయిడా (Noida) లోని సెక్టార్ 15 (Sector 15) ఏరియాలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని సెక్టార్ 15లో నివాసం ఉంటున్న నూరుల్లా హైదర్ (55), అస్మా ఖాన్ (42) ఇద్దరూ దంపతులు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లే. అస్మాఖాన్ ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు. బీహార్‌కు చెందిన నూరుల్లా హైదర్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేటే. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు ఇంజినీరింగ్ చదువుతుండగా, బిడ్డ 8వ తరగతి చదువుతోంది.
అస్మాఖాన్ సెక్టార్ 62లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నూరుల్లా హైదర్ ఉద్యోగం పోవడంతో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్మాఖాన్‌కు వివాహేతర సంబంధం ఉన్నదని నూరుల్లా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం రాత్రి కూడా అదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో సుత్తి తీసుకుని అస్మా తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అనంతరం నూరుల్లా హైదర్ పారిపోయాడు. ఘటనపై బాధితురాలి కొడుకు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.