Buddhadev | తనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటనపై సమాచారం లేదని పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య చెప్పారు. తాను ఆ అవార్డును తిరస్కరిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తిరస్కరిస్తామని చెప్పడం అరుదని భావిస్తున్నారు. పద్మ భూషణ్ అవార్డు గురించి నాకు ఎటువంటి సమాచారం లేదు. ఏ ఒక్కరూ నాకు చెప్పలేదు. ఒకవేళ వారు నాకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకుంటే నేను తిరస్కరిస్తా అని బుద్దదేవ్ చేసిన ప్రకటన సీపీఎం బెంగాల్ శాఖ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
కానీ కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం బుద్దదేవ్ భట్టాచార్య భార్యతో మాట్లాడారని కేంద్రం చెబుతున్నది. భట్టాచార్యకు పద్మభూషణ్ అవార్డు ఇవ్వనున్నట్లు ఆమెతో చెప్పగా, ఆమోదించడంతోపాటు ధన్యవాదాలు చెప్పారని హోంశాఖ వర్గాలు తెలిపాయి.
77 ఏండ్ల ఈ మార్క్సిస్టు నాయకుడు నిత్యం ప్రధాని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు. అయితే వయస్సు సంబంధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండె, ఛాతీ సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంత కాలంగా బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఇక పద్మ అవార్డుల తిరస్కరణ అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ అవార్డులను సంబంధిత వ్యక్తుల ఆమోదం పొందిన తర్వాతే ప్రకటిస్తారు.