తిరువనంతపురం: అదనపు జిల్లా కలెక్టర్‌ను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా సీపీఎం నాయకురాలిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ పదవి నుంచి తొలగించారు. (CPM Leader Removed) వామపక్ష పార్టీ అధికారంలో ఉన్న కేరళలో ఈ సంఘటన జరిగింది. కన్నూర్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ఏడీఎం) నవీన్ బాబు మరి కొన్ని నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లా పతనంతిట్టకు ఆయన బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్ 14న వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కాగా, ఎలాంటి ఆహ్వానం లేకపోయినా కన్నూర్ జిల్లా పంచాయతీ అధ్యక్ష్యురాలైన పీపీ దివ్య, ఏడీఎం నవీన్ బాబు వీడ్కోలు కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేసింది. చెంగలైలో పెట్రోల్ బంక్‌కు అనుమతి ఇవ్వకుండా చాలా నెలలు ఆయన జాప్యం చేసినట్లు విమర్శించింది. ఈ ఆరోపణలపై నవీన్ బాబు మనస్తాపం చెందారు. క్వాటర్స్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరోవైపు నవీన్ బాబును ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా దివ్యపై ఆరోపణలు వచ్చాయి. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేరళలోని ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేశాయి. ఈ నెల 17న దివ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎం చర్యలు చేపట్టింది. పార్టీ పదవి నుంచి దివ్యను తొలగించినట్లు గురువారం రాత్రి ప్రకటించింది. కన్నూర్ జిల్లా పంచాయతీ అధ్యక్షురాలి బాధ్యతలను న్యాయవాది కేకే రత్నకుమారికి అప్పగించినట్లు పేర్కొంది.
కాగా, ఏడీఎం నవీన్ బాబు మరణం పట్ల దివ్య కూడా సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేసింది. తాను కేవలం మంచి ఉద్దేశంతోనే అవినీతిపై వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది. పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పింది. న్యాయపరమైన మార్గాల ద్వారా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని తెలిపింది. పోలీస్ దర్యాప్తు నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే ఆ పదవికి రాజీనామా చేసినట్లు దివ్య వెల్లడించింది.