Corona R-Factor | దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మళ్లీ పెరుగుతున్నదని నివేదికలు చెబుతున్నాయి. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 22 రాష్ట్రాలకు విస్తరించింది. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో వైరస్ విస్తృతి ఎక్కువగా ఉందని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
ఢిల్లీ, ముంబై నగరాల్లో కరోనా రీ ప్రొడక్షన్ రేటు (ఆర్-విలువ) 2 దాటినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఈ నగరాల్లో విస్తృత వేగంతో వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ పెరుగుదలను ఆర్-ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు. ఆర్-ఫ్యాక్టర్ 1గా ఉంటే ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి మరొకరికి సోకినట్లు పరిగణిస్తారు. ఒకటి కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గిందని అంచనాకు వస్తారు.
కరోనా విస్తృతిపై చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటికల్ సైన్సెస్ (ఐఎంఎస్) తాజాగా వేసిన అంచనా ప్రకారం ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆర్-ఫ్యాక్టర్ విలువ 2 దాటిందని తేలింది. ఈ నెల 23-29 మధ్య ఢిల్లీలో ఆర్-విలువ 2.54, ముంబైలో 2.01గా రికార్డైంది. పుణె, బెంగళూరుల్లో 1.11గా, చెన్నైలో 1.26, కోల్కతాలో 1.13 శాతంగా నమోదైందని ఐఎంఎస్ శాస్త్రవేత్త సితబ్రా సిన్హా తెలిపారు.