COVID-19 | దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కేసులను గుర్తించేందుకు పరీక్షలను పెంచాలని వైద్యారోగ్యశాఖను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ఆసుపత్రులతో పాటు పాలీక్లినిక్‌లు, డిస్పెన్సరీలకు ప్రభుత్వం సూచించింది. ఇటీవల దేశ రాజధానిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశ రాజధాని ఢిల్లీలో 3800కుపైగా కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జ్వరం, దగ్గు, ఒంటినొప్పులు తదితర లక్షణాలు ఉంటే తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. శుక్రవారం దేశ రాజధానిలో 733 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏడు నెలల తర్వాత పాజిటివిటీ రేటు 19శాతానికిపైగా పెరిగింది. కొవిడ్ పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని ఇటీవల సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 2,331కి చేరాయి. అయితే, కేసుల పెరుగుదలకు కొత్త వేరియంట్ XBB.1.16 వేరియంట్ కారణమని అనుమానిస్తున్నారు. వేరియంట్‌తో భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలు బూస్టర్ డోస్ తీసుకోవడంతో నిబంధనలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. అయితే, ఇన్ఫ్లుఎంజా సబ్ టైప్ హెచ్3ఎన్2 కారణంగా ఇన్ఫ్లుఎంజా కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. H3N2 వైరస్ సోకితే ముక్కు కారటం, నిరంతర దగ్గు మరియు జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఇన్ఫ్లుయెంజా కారణంగా ఆసుప్రతుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పింది.