Supreme Court : ఢిల్లీలో గాలి నాణ్యత (Air quality) రోజురోజుకు దిగజారిపోతున్నది. ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్య కట్టడి కోరుతూ దాఖలైన పిటిషన్ను స్వీకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) డిసెంబర్ 3న విచారించనున్నట్లు తెలిపింది. ఈ కాలుష్య సమస్యను నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఇది ఆరోగ్య అత్యవసర పరిస్థితి అని సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ చేసిన వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. ‘కాలుష్యం విషయంలో కోర్టు ఏం మ్యాజిక్ చేయగలదు..’ అని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది.
‘ఒక న్యాయస్థానం ఏం మాయాజాలం చేయగలదు? ఢిల్లీ-ఎన్సీఆర్కు ఇది ప్రమాదకరమని తెలుసు. అయితే పరిష్కారం ఏమిటనేది ఇక్కడ ముఖ్యం. దీనికి గల కారణాలను గుర్తించాలి. పరిష్కారాలు కేవలం ఆ రంగంలోని నిపుణుల నుంచే లభిస్తాయి. దీర్ఘకాలిక పరిష్కారాలు లభిస్తాయని మేం ఆశిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.