భోపాల్: మాంసం వండటంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. అయితే సర్దిచెప్పిన పొరుగింటి వ్యక్తిని మహిళ భర్త కొట్టిచంపాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. ఇంట్లో మాంసం వండటంపై పప్పు, అతడి భార్య గొడవ పడ్డారు. మంగళవారం నాడు కొందరు హిందువుల ఇంట్లో నాన్వెజ్ వండరు. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు తమ ఇంట్లో మాంసం వండటాన్ని పప్పు భార్య వ్యతిరేకించింది. దీంతో ఈ అంశంపై ఆ దంపతులు పోట్లాడుకున్నారు.
అయితే దంపతుల గొడవ విన్న పొరుగున నివాసం ఉండే బిల్లు వారి ఇంటికి వెళ్లాడు. ఆ దంపతులకు సర్దిచెప్పి గొడవను సద్దుమణిగేలా చేసి తన ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతసేపటి తర్వాత పొరుగింటి వ్యక్తి బిల్లు ఇంటికి పప్పు వెళ్లాడు. అతడ్ని కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లారు. పప్పు భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.