Thali price : వెజ్, నాన్ వెజ్ థాలీ ధరల్లో ఘననీయమైన తగ్గుదల నమోదైంది. గత ఏడాది ఆగస్టు నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టు నెలలో వెజ్ థాలీ ధరల్లో 8 శాతం, నాన్ వెజ్ థాలీ ధరల్లో 12 శాతం తగ్గుదల కనిపించింది. ఈ వివరాలను క్రిసిల్ (CRISIL) తాజా రిపోర్టు స్పష్టం చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం థాలీ ధరల్లో తగ్గుదలకు కారణమని క్రిసిల్ తెలిపింది.
వెజ్ థాలీ ధర తగ్గడానికి ప్రధాన కారణం టమాటా ధరల్లో తగ్గుదలేనని క్రిసిల్ పేర్కొంది. వెజ్ థాలీలో టమాటా 14 శాతం ఉంటుందని తెలిపింది. గత ఏడాది ఆగస్టులో కిలో టమాటా ధర రూ.102 ఉండగా.. ఈ ఏడాది అది కిలో రూ.50కి తగ్గిందని వెల్లడించింది. అదేవిధంగా గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఆగస్టులో గ్యాస్ సిలిండర్ ధర కూడా 27 శాతం తగ్గిందని, అప్పుడు రూ.1,103 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.803 తగ్గిందని పేర్కొంది.
అదేవిధంగా వంటనూనె, కారం, జీలకర్ర తదితర పదార్థాల ధరల్లో కూడా 5 శాతానికంటే తక్కువ తగ్గుదల నమోదైందని, ఇది కూడా థాలీ ధరలు తగ్గడానికి ఒక కారణమైందని క్రిసిల్ తెలిపింది. ఇక గత ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే ఈ ఏడాది ఆగస్టులో బ్రాయిలర్ చికెన్ ధర 13 శాతం తగ్గిందని, నాన్ వెజ్ థాలీలో చికెన్ వాటా 50 శాతం ఉంటుందని.. నాన్ వెజ్ థాలీ ధర తగ్గడానికి చికెన్ ధర తగ్గడం ప్రధాన కారణమని క్రిసిల్ స్పష్టంచేసింది.