హైదరాబాద్, జూలై 25 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పగ్గాలు చేపట్టింది మొదలు విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ అమితాసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. దీంతో ఆయన విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయమూ అంతకంతకూ పెరిగిపోతుండటం విమర్శలకు దారి తీస్తున్నది. ఈ క్రమంలో 2021-25 వరకూ ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చును తెలియజేయాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబెరాయ్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
దీనికి కేంద్రం స్పందిస్తూ.. 2021-25 మధ్య మోదీ విదేశీ పర్యటనలకు రూ. 362 కోట్లు ఖర్చయ్యాయని, 2025లోనే రూ. 67 కోట్లు ఖర్చు చేసినట్టు సమాధానమిచ్చింది. మొత్తంగా 11 ఏండ్ల పాలనలో ప్రధాని మోదీ 144 విదేశీ పర్యటనలు చేయగా, దీని కోసం కేంద్రం రూ.1,846 కోట్ల ప్రజా సొమ్మును ఖర్చు చేసింది.
మోదీ విదేశాలకు పలుమార్లు వెళ్తున్నప్పటికీ దౌత్య విజయాలు మాత్రం ఏమీలేవని నిపుణులు చెప్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అగ్రరాజ్యాల మద్దతును కూడగట్టడంలో, అమెరికా సుంకాల విషయంలో, కెనడాతో మైత్రిలో మోదీ విఫలమయ్యారని గుర్తు చేశారు.