బెంగళూరు, జూలై 14: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో అవినీతి బాగోతాలు మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. వాల్మీకి కార్పొరేషన్లో చోటుచేసుకున్న భారీ కుంభకోణం (రూ.187 కోట్ల వరకు నిధుల దారిమళ్లింపు) మరువకముందే, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్‌లో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. గతంలో వక్ఫ్ బోర్డ్ సీఈవోగా పనిచేసిన జుల్ఫీకరుల్లా రూ.4 కోట్ల నిధుల్ని అక్రమంగా తరలించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నిధులు కాజేసిన అతడిపై చర్యలు చేపట్టాలని వక్ఫ్ బోర్డ్ ప్రస్తుత సీఈవో మీర్ అహ్మద్ అబ్బాస్ బెంగళూరులోని హై గ్రౌండ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వక్ఫ్‌బోర్డ్‌కు అతడి వల్ల రూ.8.03 కోట్లు నష్టం వాటిల్లిందని ఆయన ఆరోపించారు. ‘గుల్బర్గా దర్గాలో వక్ఫ్ భూముల్ని తీసుకున్నందుకు ప్రభుత్వం రూ.2.29 కోట్లు చెల్లించింది. అలాగే ఎండోమెంట్ శాఖ నుంచి రూ.1.79 కోట్లు వక్ఫ్ బోర్డ్‌కు జమయ్యాయి. మొత్తం రూ.4,00,45,465 వక్ఫ్ బోర్డ్ బ్యాంక్ ఖాతాలో జమైంది. ఈ మొత్తాన్ని 2016 నవంబర్ 26న అప్పటి సీఈవో జుల్ఫీకరుల్లా తన బ్యాంక్ ఖాతాలోకి అక్రమంగా బదిలీ చేశాడు’ అని సీఈవో అబ్బాస్ చెప్పారు. అయితే నిధుల్ని కాజేసిన ఇన్నేండ్ల తర్వాత 2024 జూన్ 12న వక్ఫ్ బోర్డ్ ఫిర్యాదు చేయటం సంచలనంగా మారింది. వాల్మీకి కార్పొరేషన్ స్కామ్‌లో జరిగినట్టుగానే వక్ఫ్ బోర్డ్‌లో నిధులు దారిమళ్లటం రాష్ట్రంలో సంచలనం రేపింది. వాల్మీకి స్కామ్‌లో ఏకంగా రాష్ట్ర మంత్రి బీ నాగేంద్ర సహా 11 మంది అరెస్టు అయ్యారు.