గురువారం 09 జూలై 2020
National - Apr 23, 2020 , 10:57:40

ఐసోలేషన్‌ వార్డుల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం

ఐసోలేషన్‌ వార్డుల్లోకి సెల్‌ఫోన్లు నిషేధం

కోల్‌కతా : కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఐసోలేషన్‌ వార్డుల్లోకి సెల్‌ఫోన్లను తీసుకెళ్లకుండా పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. చనిపోయిన ఇద్దరు కరోనా రోగులను సుమారు 2 నుంచి 3 గంటల పాటు ఐసోలేషన్‌ వార్డుల్లోనే ఇతర రోగుల మధ్య పడుకోబెట్టిన దృశ్యాలు బెంగాల్‌లో వైరల్‌ అయ్యాయి. దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో.. బెంగాల్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డాక్టర్లు, హెల్త్‌ వర్కర్లు, రోగులు ఎవరూ కూడా సెల్‌ఫోన్లను వెంట తెచ్చుకోవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ఆస్పత్రిలో ల్యాండ్‌ లైన్‌, ఇంటర్‌కమ్‌ ఫోన్లను ఏర్పాటు చేశారు. ఈ ల్యాండ్‌లైన్లను ఉపయోగించుకోవాలని వైద్య శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. 

ఆ రెండు మృతదేహాల చుట్టూ ఇతర రోగులు తిరుగుతున్నారు. ఒక మృతదేహాన్ని ఏమో ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టిపెట్టగా, మరో మృతదేహాన్ని బట్టలతో చుట్టారు. ఈ వీడియోను కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని బాబుల్‌ సుప్రియో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

అయితే ఈ వీడియోను చిత్రీకరించి వైరల్‌ చేసిన ఓ రోగికి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. సదరు వ్యక్తికి కరోనా నెగిటివ్‌ రావడంతో ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వీడియో చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


logo