Covid-19 | గత నెలన్నరగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు నిర్వహించిన అధ్యయనాల్లో ఒమిక్రాన్ ఇతర వేరియంట్స్ కన్నా ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో ఈ వేరియంట్ కారణంగా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు తేలింది. ఆయా దేశాల్లో ఆసుపత్రుల్లో చేరిన రోగుల సంఖ్య పెరిగింది. ఈ వేరియంట్ కారనంగా జనవరిలో చైనాలో మరోసారి ఇన్ఫెక్షన్ పెరుగుదల ఉండవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా జేఎన్.1 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.
అయితే, భారత్‌లో పరిస్థితిని పరిశీలిస్తే.. గత రెండు, మూడురోజులుగా ఇన్ఫెక్షన్ కేసుల్లో తగ్గుదల ఉన్నట్లు తెలిసింది. 20 రోజుల కిందట రోజుకు 500-600 మందికి వైరస్ సోకగా.. ప్రస్తుతం రోజుకు సగటున 300 తగ్గింది. కొత్త వేరియంట్ కారణంగా గత నెల రోజుల నుంచి దేశంలో కొవిడ్ పరీక్షలు పెరిగాయి. అయితే, అందరూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత సమయంలో దగ్గు, జలుబు కారణంగా కేసులు పెరుగుతున్నాయని.. ఈ క్రమంలో ప్రతీది కొవిడ్ అనుకోవాల్సిన అవసరం లేదని తెలుపుతున్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాలు కొవిడ్ పరీక్షలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశాయి.
వైరస్‌తో సోకిన తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందేందుకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుందని.. ప్రతి ఇన్ఫెక్షన్కు ఇంక్యుబేషన్ పీరియడ్ భిన్నంగా ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ రోగులకు చికిత్స చేసే ఇంటెన్సివ్ కేర్ డాక్టర్ వినీత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కరోనావైరస్ యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ 4-10 రోజులు ఉంటుందని చెప్పారు. గతంలో వచ్చిన కరోనా వేరియంట్ల తరహాలోనే ఈ వేరియంట్‌తో ఇన్ఫెక్షన్ కూడా లక్షణాలను చూపించడానికి చాలా సమయం పడుతుందన్నారు. సాధారణంగా ఇన్ఫెక్షన్ లక్షణాలు 6-8 రోజుల్లో మరింత స్పష్టంగా కనిపించడం జరుగుతుందన్నారు. కరోనా లక్షణాలు కూడా కనిపిస్తే.. ఇంక్యుబేషన్ పీరియడ్ వరకు వేచి ఉంటే.. పరీక్షల ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు.