బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 17:07:13

కరోనా కల్లోలంలో 10 మైలురాళ్లు

కరోనా కల్లోలంలో 10 మైలురాళ్లు

కరోనా వైరస్ పెద్దపెద్ద అంగలు వేస్తూ మైలురాళ్లను అధిగమిస్తున్నది. ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపట్టే పనిలో తలమునకలుగా ఉన్నాయి.  మరోవైపు కరోనా తన పని తాను చేసుకుపోతున్నది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని వివరించే 10 అంశాలను ఇప్పుడు చూద్దాం.. 

1. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన 21 రోజుల లాక్ డౌన్ నాల్గవరోజులోకి ప్రవేశించిన నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి పెద్దసంఖ్యలో వలస కూలీలు సొంతఊళ్లకు కాలిబాటన తిరిగివెళ్తున్నారు. రైళ్లు, బస్సులు నిలిచిపోయిన కారణంగా వారు వందల కిలోమీటర్లు కాలినడకనే వెళ్లాల్సి 

వస్తున్నది. వీరి సంఖ్య లక్షల్లో ఉంటుందా.. లేక కోట్లలో ఉంటుందా అనేది అంచనాకు అందడం లేదు. ఈ మహాప్రస్థానాన్ని నిలిపివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.

2. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఆర్థికరంగానికి కరోనా వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి పలు దిద్దుబాటు చర్యలు ప్రకటించారు. బ్యాంకుల నగదు నిష్పత్తిని తగ్గించారు. వడ్డీరేట్లను తగ్గించారు.

3. కరోనా వల్ల ఆదాయాలు కోల్పోయే వర్గాలకోసం ఆర్బీఐ చీఫ్ మూడు మాసాల వరకు రుణవాయిదాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులపై మొరటోరియం విధించారు.                

4. అంతకు ఒకరోజు ముందు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.1.75 లక్షల కోట్ల ఆ్రథిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించారు. పేదలకు అదనంగా 5 కిలోల గోధుమలు లేదా బియ్యం రేషన్ ఇస్తామని, ఎవరూ ఆకలికి గురికాకుండా చూస్తామని ఆమె వెల్లడించారు.

5. స్వదేశీ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఏప్రిల్ 15 వరకు పొడిగించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇదివరకే నిలిపివేశారు.

6. విమానాల రాకపోకలను నిలిపివేసిన దరిమిలా వైద్యపరమైన లేదా మానవతాపరమైన కార్యకలాపాలకు తమ విమనాలను వినియోగించుకోవచ్చని స్పైస్ జెట్ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. ఢిల్లీ, ముంబై, పాట్నాల మధ్య వలస కార్మికుల తరలింపునకు సర్వీసులు నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

7. లాక్‌డౌన్ ఫలితంగా ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ వంటి ఈ-టెయిలర్ల సరఫరాలకు విఘాతం ఏర్పడింది. ప్రజలకు సరఫరాలు నిలిచిపోకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. 

8. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం విశ్వవ్యాప్తంగా 5 లక్షల మందికి కరోనా సోకింది. 25 వేలమందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా సోకినవారిలో బ్రిటన్ యువరాజు చార్లెస్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. త్వరగా కోలుకోవాలని ఈకాంక్షిస్తూ  

బోరిస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపారు.

9. ఇప్పుడు కరోనా తీవ్రత అమెరికాకు మారింది. అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. అందులో మహా నగరం న్యూయార్క్‌దే సింహభాగం. అమెరికా ఆరోగ్య వ్యవస్థకు అగ్నిపరీక్ష ఎదురవుతున్న నేపథ్యంలో వెంటిలేటర్ల తయారీకి అత్యవసర అధికారాల కింద జీఎం సంస్థకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.

10. సాంకేతికంగా సార్స్ కోవిడ్-19 అని పిలిచే నూతన కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేసి వదిలిపెట్టింది. ప్రస్తుతం ఇటలీ, స్పెయిన్, ఇరాన్ కరోనా కోరల కింద నలుగుతున్నాయి.  ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే వెయ్యిమందికి పైగా మరణించారు. ప్రస్తుత కరోనా ఉత్పాతంలో ఇది మరో రికార్డు.


logo