న్యూఢిల్లీ: దేశంలో ప్యాకేజ్డ్ ఆహారాలు, సోడాలపై రెడ్ ఫ్లాగ్(ఎరుపు రంగు హెచ్చరికలు) లేబుళ్లను ముద్రించాలన్న ప్రతిపాదనను ప్రముఖ ఆహార సంస్థలు కోకాకోలా, నెస్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చక్కెర పరిమాణం అధికంగా ఉంటే ఎరుపు రంగు, కొవ్వు తక్కువగా ఉంటే ఆకుపచ్చ రంగు వంటి రంగుల కోడింగ్ లేబుళ్లను ఇప్పటికే దాదాపు 20 దేశాలు అమలు చేస్తున్నాయి. లండన్‌లో విక్రయించే కూల్ డ్రింక్ ఫాంటాలో 63 క్యాలరీలు ఉంటాయి. అదే బ్రాండ్ భారతదేశంలో కొనుగోలు చేస్తే, అందులో మూడు రెట్లు ఎక్కువ చక్కెర ఉంటుంది.
యూరప్‌లో రంగుల వాడకానికి ఆరోగ్య హెచ్చరిక ముద్రించడం తప్పనిసరి. అయితే భారతదేశంలో ఈ రంగుల వాడకం గురించిన సమాచారం క్యాన్ వెనుక భాగంలో కేవలం చిన్న అక్షరాలతో మాత్రమే పేర్కొంటారు. ప్యాక్ చేసిన ఉత్పత్తుల ముందు భాగంలో పోషకాహార హెచ్చరికలను తప్పనిసరి చేయాలనే భారతదేశ ప్రయత్నాలను ప్రముఖ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. భారతీయ వంటకాలు మరింత ఘాటైన రుచులను కలిగివుంటాయనే విషయాన్ని హెచ్చరిక లేబుళ్లు పరిగణలోకి తీసుకోలేవని పేర్కొంటూ, బదులుగా కంపెనీలు చక్కెర, కొవ్వు, ఉప్పు పరిమాణాలను సూచించే బ్లాక్ అండ్ వైట్ పట్టికను ప్రదర్శించాలని భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రతిపాదించింది. అయితే దీనిపై ప్రజారోగ్య కార్యకర్తలు పిటిషన్ దాఖలు చేసిన దరిమిలా, సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో హెచ్చరిక లేబుళ్లను పరిశీలించాలని నియంత్రణ సంస్థలను ఆదేశించింది.
ఇజ్రాయెల్ దేశపు ఎరుపు, ఆకుపచ్చ సందేశ విధానాన్ని పరిశీలించాలని కూడా ఏజెన్సీకి సూచించింది. అయితే పరిశ్రమ ప్రతినిధులతో గత మార్చిలో సమావేశం ముగిశాక ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇంటర్ ప్రిటేటివ్ లేబులింగ్ అంశంపై వెనక్కి తగ్గింది. ప్యాకేజింగ్‌పై అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించడం కష్టతరమన్న పరిశ్రమ వాదనను సమర్థిస్తూ కోర్టుకు తెలిపింది. దీనిపై న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారతదేశం తన పౌరుల సమగ్ర ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నదనే విషయం ప్రపంచానికి తెలియాలని పేర్కొన్నారు. కాగా లేబులింగ్ విధానానికి సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతున్నందున దీనిపై వ్యాఖ్యానించేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిరాకరించింది.