Karnataka | బెంగళూరు, మార్చి 3: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వం మార్పు పోరు రోజురోజుకూ ముదురుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లోపల ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే బసవరాజు వీ శివగంగ ఆదివారం జోస్యం చెప్పగా, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీరప్ప మొయిలీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాయకత్వం మార్పుపై అధిష్టానం నిర్ణయమే అంతిమమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేయగా ఈ అంశంపై తాను ఏమీ మాట్లాడలేనంటూ డీకే శివకుమార్ మౌనాన్ని ఆశ్రయించారు. కర్ణాటకలోని కర్కాలాలో సోమవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న వీరప్ప మెయిలీ ముఖ్యమంత్రి మార్పు తథ్యమని, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. అది పరిష్కారమైపోయిన అంశమని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రిగా డీకే బాధ్యతలు ఏ క్షణంలోనైనా చేపట్టవచ్చని, తన కష్టం, నాయకత్వ పటిమతోనే డీకే ఆ స్థానాన్ని సంపాదించుకుంటున్నారని మెయిలీ అన్నారు. డీకేకు మొదటిసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంలో తన పాత్రను ఆయన గుర్తు చేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీ కోసం డీకే చేసిన సేవలను మొయిలీ ప్రశంసించారు. నాయకత్వ మార్పుపై పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిని డీకే చేపట్టడం అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. విమర్శలు లేక ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ డీకే ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు.
రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై వీరప్ప మొయిలీ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి డీకే శివకుమార్ నిరాకరించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని డీకే జవాబిచ్చారు. ముఖ్యమంత్రి మార్పుపై పార్టీలో జోరుగా సాగుతున్న ప్రచారంపై వ్యాఖ్యానించడానికి డీకే నిరాకరించారు. తాను పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నానని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రమంతా పర్యటించి బూత్ కమిటీల చేత ప్రతిజ్ఞ చేయించాల్సి ఉందని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. తాను బీజేపీకి దగ్గరవుతున్నానంటూ వస్తున్న వార్తలను డీకే తోసిపుచ్చారు. అదంతా తప్పుడు ప్రచారమని, కాంగ్రెస్ పట్ల తన విధేయత చెక్కుచెదరదని ఆయన పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు తాను నడుచుకుంటానని, నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకోవలసింది అధిష్టానమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం స్పష్టం చేశారు. వీరప్ప మొయిలీ చేసిన ప్రకటనపై సిద్ధరామయ్య స్పందిస్తూ దీనిపై అధిష్టానమే నిర్ణయం తీసుకోవాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. మొయిలీ చెప్పారా లేక మరెవరైనా చెప్పారా అన్నది ముఖ్యం కాదని, అధిష్టానం ఏమి చెప్పినా అదే ఫైనల్ అంటూ సీఎం చెప్పారు.
లంచ్ తర్వాత ఎమ్మెల్యేలు కునుకు తీసేందుకు ఇప్పటికే కర్ణాటక శాసనసభలో రిక్లెయినర్లు ఏర్పాటుచేయగా, తాజాగా మసాజ్ కుర్చీలను కూడా ఏర్పాటుచేయనున్నట్టు స్పీకర్ యూటీ ఖాదర్ తెలిపారు. ఇదేం ఆడంబరం కోసం కాదని, గంటల తరబడి అసెంబ్లీలో కూర్చొని అలసిపోతున్న ఎమ్మెల్యేలకు సౌకర్యవంతంగా ఉండాలన్నదే తన ఆరాటమని చెప్పుకొచ్చారు.రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో అనవసర ఖర్చులెందుకని బీజేపీ అభిప్రాయపడింది. రాష్ట్రంలో నిధుల కొరత ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని బీజేపీ ఎంఎల్సీ సీటీ రవి అన్నారు. ముందు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి ఆ తర్వాత మీ సుఖం కోసం కుర్చీలు తెచ్చుకోండని ఆయన వ్యాఖ్యానించారు.