Agniveer | న్యూఢిల్లీ, జూలై 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022లో తీసుకొచ్చిన అగ్నివీర్ పథకంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో విధి నిర్వహణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో మందుపాతర పేలుడులో మరణించిన పంజాబ్‌కు చెందిన అగ్నివీర్ అజయ్ సింగ్ కుటుంబానికి పరిహారం విషయంలో తాజాగా వివాదం రేగింది. అజయ్ సింగ్ మరణించి ఆరు నెలలైనా బాధిత కుటుంబానికి ఇప్పటి వరకు పరిహారం అందలేదని, అగ్నివీర్ల పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపుతున్నదని విపక్ష పార్టీల నేతలు ఆరోపిన్నారు. కాగా, విధి నిర్వహణలో మరణించిన అగ్నివీర్ల కుటుంబాలకు ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందజేస్తుందని రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల పార్లమెంట్లో పేర్కొన్నారు.
తాజా వివాదంపై ఆర్మీ ఎక్స్ పోస్టులో స్పందించింది. బాధిత కుటుంబానికి దాదాపు రూ.1.65 కోట్లు వస్తాయని, ఇప్పటికే బీమా ఇతరత్రాల ద్వారా మూడు విడతలుగా రూ.98.39 లక్షలు అందజేశామని తెలిపింది. అగ్నిపథ్ స్కీమ్ నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియాగా రూ.44 లక్షలు, ఇతర రూపాల్లో కలిపి మొత్తంగా దాదాపు రూ.67 లక్షల మేర వస్తాయని, పోలీసు వెరిఫికేషన్ తర్వాత ఈ చెల్లింపులు ఉంటాయని ఆర్మీ వివరణ ఇచ్చింది. కాగా, అజయ్ కుమార్ తండ్రి కూడా ఓ వీడియోలో మాట్లాడుతూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. ‘విధి నిర్వహణలో అగ్నివీర్ చనిపోతే ప్రభుత్వం రూ.కోటి ఇస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్లో చెప్పారు. అయితే మాకేమీ రాలేదు’ అని అన్నారు. ఈ వీడియోను రాహుల్ గాంధీ బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత.. గంటల వ్యవధిలోనే ఆయన ఆరోపణలు ఖండిస్తూ ఆర్మీ తన వివరణతో కూడిన పోస్టు చేసింది.
కాగా, ఏడాది కన్నా తక్కువ వ్యవధిలోనే దాదాపు 20 మంది అగ్నివీరులు మరణించినట్టు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. వీరిలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొందరు విధి నిర్వహణలో మరణించారు. ఆర్మీలో 18 మంది అగ్నివీరులు చనిపోయారని, గత వారం ఐఏఎఫ్‌లో పనిచేస్తున్న శ్రీకాంత్ కుమార్ అనే అగ్నివీర్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సెంట్రీ డ్యూటీలో ఉండగా బలవన్మరణానికి పాల్పడినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూపీలోని బలియా జిల్లాకు చెందిన శ్రీకాంత్ కుమార్ అగ్నివీర్‌గా ఐఏఎఫ్‌లో 2022లో చేరాడు. 2023, అక్టోబర్‌లో సియాచిన్‌లో విధి నిర్వహణలో ఉన్న అక్షయ్ లక్ష్మణ్ అనే అగ్నివీర్ మరణించారు.
మరోవైపు అగ్నిపథ్ స్కీమ్‌లో పలు సవరణలను త్రివిధ దళాలు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్టు తెలుస్తున్నది. అగ్నివీరుల నియామక గరిష్ఠ అర్హత వయసును 21 నుంచి 23కు పెంచాలని, అదే విధంగా నాలుగేండ్ల సర్వీసు తర్వాత కనీసంగా 50 శాతం మందిని శాశ్వత పద్ధతిన కొనసాగించేలా కేంద్రానికి సిఫారసు చేయనున్నట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు. అగ్నిపథ్ స్కీమ్ కింద నియమితులైన వారిని త్రివిధ దళాల్లోకి పెద్ద సంఖ్యలో తీసుకోనున్నట్టు ఆ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం అగ్నివీర్లుగా నియామకానికి 17-21 ఏండ్ల మధ్య వయసు ఉండే వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా కేవలం 25 శాతం మందిని మాత్రమే శాశ్వత సర్వీసులోకి తీసుకొంటారు.