న్యూఢిల్లీ: కాంట్రాక్టు ఉద్యోగిని అయినంత మాత్రాన ప్రసూతి ప్రయోజనాలు పొందకుండా తిరస్కరించరాదని, వారు కూడా దానికి అర్హులేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రసూతి ప్రయోజనాలు కల్పించడానికి అధికారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఓ ఒప్పంద ఉద్యోగిని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ప్రసూతి ప్రయోజన చట్టం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చే మహిళ చేసే ఉద్యోగం ఏ తరహాది అది పర్మినెంటా, కాంట్రాక్టా, ఆఫీసరా, అటెండరా అన్న అంశంతో సంబంధం లేకుండా ప్రతి మహిళా ఉద్యోగినికి దాని ప్రయోజనాలు ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.