లక్నో: కాంట్రాక్ట్ కిల్లర్ ఒక మహిళా లాయర్‌ను హత్య చేశాడు. ఆమె హత్య కోసం ఒప్పుకున్న డబ్బు భర్త, అత్తమామలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన అతడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వారిపై ఫిర్యాదు చేశాడు. (Contract killer seeks Police help) ఈ విషయం తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ సంఘటన జరిగింది. ఏడాది కిందట మిల్క్ బూత్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మహిళా న్యాయవాది అంజలిని ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఆస్తి తగాదాల కారణంగా హంతకులతో చంపించినట్లు అనుమానించిన పోలీసులు ఆమె భర్త, అత్తమామలను తొలుత అదుపులోకి తీసుకున్నారు. అయితే అంజలి హత్యతో ప్రమేయం లేదని తేల్చిన తర్వాత వారిని విడుదల చేశారు.
కాగా, నేరం జరిగిన కొన్ని రోజుల తర్వాత షూటర్లు నీరజ్ శర్మ, యశ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. సురేష్ భాటి అనే వ్యక్తి వీరిని కిరాయికి నియమించాడని, అంజలి హత్యకు ముందు రోజు రాత్రి నీరజ్ ఇంట్లో దుండగులు బస చేసినట్లు దర్యాప్తులో తెలుసుకున్నారు. నేరం కోసం వినియోగించిన రెండు స్కూటర్లు, పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఇటీవల బెయిల్‌పై విడుదలైన నీరజ్ శర్మ తాజాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తమను వేధిస్తున్న అంజలిని హత్య చేసేందుకు రూ.20 లక్షలకు ఆమె భర్త, అత్తమామలు డీల్ కుదుర్చుకున్నారని ఫిర్యాదు చేశాడు. ఒప్పందం ప్రకారం వారి గురించి తాము బయటపెట్టకుండా జైలుకు వెళ్లినట్లు చెప్పాడు.
అయితే ఆ డబ్బుతోపాటు ఒప్పందం చేసుకున్న ఐదు షాపులను వారు ఇవ్వలేదని నీరజ్ ఆరోపించాడు. ఈ నేపథ్యంలో అంజలి హత్యలో ప్రధాన కుట్రదారులైన ఆమె భర్త, అత్తమామలు, మరో బంధువుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరాడు. కాంట్రాక్ట్ హత్యకు సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు అందించాడు. దీంతో నీరజ్ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.