న్యూఢిల్లీ, జూలై 20: న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సుమారుగా 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు సమయానికి జీతాలు రాక తీవ్రమైన మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అద్దెలు, నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక, అప్పులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
రుణాలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఇంటి ఖర్చులకు డబ్బులు లేక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్చి 31తో ముగిసిన తమ కాంట్రాక్టులను మొదట జూన్ వరకు, ఆ తర్వాత సెప్టెంబర్ వరకు పొడిగించారని, ఏప్రిల్, మే, జూన్ నెల జీతాలు ఇంకా చెల్లించలేదని ఉద్యోగులు తెలిపారు. తాము ఎన్సీఈఆర్టీలోని ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్లు, విభాగాధిపతులను పదేపదే సంప్రదించగా, కేంద్ర విద్యాశాఖ నుంచి నిధులు విడుదల కాలేదన్న విషయం తమకు తెలిసిందన్నారు.