న్యూఢిల్లీ: అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ సుప్రీం కోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ధిక్కరించి తమ ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసిందని ఆరోపిస్తూ 47 మంది పౌరులు అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారించిన జస్టిస్‌లు బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం, దీనిపై మూడు వారాల్లో స్పందన తెలియజేయాలంటూ అస్సాం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
బుల్డోజర్తో కూల్చివేతలు అధికారులపై గ్రామస్థుల దాడి
ఫరుఖాబాద్: తమ గ్రామంలో చేపట్టిన బుల్డోజర్ చర్యపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసుల సమక్షంలోనే ఇద్దరు రెవెన్యూ అధికారులపై దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉక్రా గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ బంజరు భూమిలో నిర్మించిన పలు నిర్మాణాలను శనివారం అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. సోమవారం బీజేపీ నాయకులు గ్రామస్థులు, సర్కిల్ అధికారి, ఎస్‌హెచ్‌వోతో మాట్లాడుతుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు ఇద్దరు లేఖ్ పాలక్‌ల(రెవెన్యూ అధికారులు)పై దాడి చేశారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని నియంత్రించారు.