ముంబై, జూలై 6 (నమస్తే తెలంగాణ): చట్టం లేదా రాజ్యాంగం వివరణ ఆచరణాత్మకంగా ఉండాలని, సమాజ అవసరాలు, ప్రస్తుత తరం సమస్యలకు అనుగుణంగా ఉండాలని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. న్యాయమూర్తి బాధ్యతలు అంటే 10 నుండి 5 గంటల వరకు చేసే ఉద్యోగం కాదని.. సమాజానికి, దేశానికి సేవ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు. బాంబే హైకోర్టులో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమూర్తుల దురుసు ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ న్యాయమూర్తులు దురుసుగా ప్రవర్తించకూడదన్నారు.
ప్రతిష్ఠాత్మక న్యాయ సంస్థలు, న్యాయస్థానాల ప్రతిష్ఠను దెబ్బ తీసే ఏ పని న్యాయమూర్తులు చేయకూడదని, ఈ ఖ్యాతి తరతరాలుగా న్యాయవాదులు, న్యాయమూర్తుల విధేయత, అంకితభావంపై నిర్మించబడిందని ఆయన అన్నారు. న్యాయమూర్తులు తమ మనస్సాక్షికి, తమ పదవీ ప్రమాణానికి, చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని సీజేఐ అన్నారు. బాంబే హైకోర్టును ప్రశంసిస్తూ ‘నేను ఇకడ న్యాయవాదిగా, తరువాత న్యాయమూర్తిగా పనిచేశాను.’ అని గుర్తు చేసుకున్నారు.